సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య ప్రగాఢ స్నేహం ఏర్పడడం అరుదుగా జరుగుతుంటుంది. ఇగో సమస్యలతో దూరదూరంగా మెలగుతూ ఉంటారు. అయితే ఒకప్పటి హీరోయిన్లు రాధిక, సరిత మంచి స్నేహితులు. కెరీర్ ఆరంభమైన తొలినాళ్లలోనే వారికి స్నేహం కుదిరింది. క్రమంగా అది మరింత బలపడుతూ వచ్చింది. 1983లో తోటి నటుడు ప్రతాప్ పోతన్‌ను రాధిక వివాహం చేసుకున్నారు. అయితే వారి వైవాహిక బంధం ఎక్కువ కాలం నిలవకపోవడం వేరే సంగతి. ప్రతాప్ పోతన్ 2022 జూలై 15న కన్నుమూశారు.
రాధిక, ప్రతాప్ పోతన్ పెళ్లిలో రాధిక తరపున చాలా పనులు చూసుకుంది సరిత. అదివరకు ఎన్నోసార్లు రాధిక ఎదుర్కొన్న క్లిష్ట సమయాల్లో సపోర్ట్‌గా నిలిచి, ఆమెకు ధైర్యాన్నిచ్చింది సరిత. 1983లో ఒకరోజు ఉన్నట్లుండి రాధిక పెళ్లి నిర్ణయం తీసుకుంది. ఆ సంగతి ముందుగా సరితకే చెప్పింది. ఆమె ఎంతో సంతోషించింది. రాధిక పక్కనే ఉండి పెళ్లి బట్టల దగ్గర్నుంచీ, మంగళసూత్రం వరకూ అన్నిటినీ కొనడంలో ఎంతగానో సహకరించింది సరిత. అప్పట్లో రాధిక ప్రతిదానికీ కలవరపడుతూ, గందరగోళానికి లోనయ్యేది. అలాంటి సమయాల్లో సరిత ఆమె పక్కనే ఉండి, సాయం చేసింది. రాధికను ఎప్పటికప్పుడు ఉత్సాహపరిచేది.
ఈ ఇద్దరికీ మరో మంచి స్నేహితురాలు ఉంది.. ఆమె, నటి శ్రీప్రియ. ఈ పెళ్లి విషయం ఆమెకు చెప్పాలని ఎంతో ప్రయత్నించారు రాధిక, సరిత. అప్పుడు శ్రీప్రియ ఔట్‌డోర్ షూటింగ్‌కు వెళ్లి ఉంది. అక్కడకు ఫోన్ చేసింది రాధిక. కానీ శ్రీప్రియ దొరకలేదు. దాంతో ఎంతో ముఖ్యమైన ఆ సమయంలో రాధిక పెళ్లికి సంబంధించిన బాధ్యతల్లో ఎక్కువగా సరితే చూసుకుంది.
పెళ్లి తేదీ అకస్మాత్తుగా నిర్ణయించడంతో, ఆ రోజు రాధిక షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉండటంతో నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుకు ఆ సంగతి చెప్పింది రాధిక. అప్పుడాయన 'ముగ్గురు మొనగాళ్లు' మూవీ నిర్మిస్తున్నారు. అందులో శోభన్‌బాబు జోడీగా నటిస్తోంది రాధిక. ఆమె చెప్పిన మాటలకు పూర్ణచంద్రరావు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. సరితకు కూడా ఆ రోజు షూటింగ్ ఉంది. కానీ ఎలాగైనా పెళ్లి సమయానికి చేరుకోవాలని, రాధిక కోసం లంచ్ త్యాగం చేసి, షూటింగ్‌లో తన వర్క్ వీలైనంత త్వరగా ముగించమని నిర్మాత దర్శకుల్ని అడిగి, ముందుగానే వేడుకకు హాజరైంది. ఇలా సరిత మంచితనం గురించీ, స్నేహితురాలిగా ఆమె చూపిన ప్రేమ, ఆదరాభిమానాల గురించి స్వయంగా వెల్లడించింది రాధిక.